
శ్రావణ సోమవారం.. ఇవాళ చాలా మంచిది. ఇవాళ శివుడిని పూజించి అభిషేకిస్తే చాలా మంచిదట. ఈ రోజు రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 4.26 గంటల వరకూ శుక్ల యోగం ఉంటుంది.ఇక ఉదయం స్వాతి నక్షత్రం 08:33 వరకూ ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం రానుంది. మరి శ్రావణ సోమవారం పూజా విధానం ఏంటంటే.. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన లేచి ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో శుచిగా స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇక అక్కడి నుంచి పూజా విధానం ప్రారంభమవుతుంది.
ఇంటి పూజ గదిలో ఉన్న స్తంభంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచి పీటాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పీటంపై శివ పార్వతుల విగ్రహాలను ప్రతిష్టించాలి. తర్వాత నీటిలో పెరుగు, పాలు, నెయ్యి, తేనె, గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. శివునికి తమలపాకులు, అక్షతలను సమర్పించి, పార్వతీదేవికి పదహారు అలంకారాలు చేయాలి. అనంతరం శివపార్వతుల ముందు నెయ్యితో దీపం వెలగించాలి. ఆ తరువాత హారతి ఇచ్చి శివ మంత్రాలను పఠించాలి. ఇక శివపార్వతులకు నైవేద్యంగా పాయసం, పండ్లు, స్వీట్స్ వంటివి పెట్టాలి. ఇక ప్రసాదాన్ని ఇంట్లోని వారందరికీ పంచండి. ఇవాళ వీలైతే శక్తి మేర దానం చేసినా మంచిదేనట..
