Site icon Bhakthi TV

నేడు ఏరువాక పూర్ణిమ.. వ్యవసాయదారులకు సుప్రసిద్ధమైన పండుగ..

తెలుగునాట ‘ఏరువాక’ వ్యవసాయదారులకు సుప్రసిద్ధమైన పండుగ. ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు జరుపుకొనే పండుగ ఇది! అందుకే దీన్ని ‘ఏరువాక పున్నమి’ అని అంటారు. గ్రామీణులు ఈ పర్వదినాన ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, రంగురంగుల కాగితాలతో అలంకరించి పూజిస్తారు. ధూపదీప, నివేదనలను చేస్తారు. ‘ఏరు’ అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కి ప్రారంభ దినమని అర్థాలున్నాయి. ఈ పండుగ వర్షరుతువు ఆరంభంలో వస్తుంది, వ్యవసాయానికి తగినంత వృష్టిని ప్రసాదించమని ఈరోజున ఇంద్రుడిని పూజిస్తారు. పొలం దున్నడానికి శుభకరమైన నక్షత్రం ‘జ్యేష్ఠ’ అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జ్యేష్ఠ నక్షత్రంతో చంద్రుడు కూడిఉండే పర్వడి జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులన్నింటికీ అధిపతి చంద్రుడు.

ఓషధులు సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం విశేషమైన ఫలసాయం అందిస్తుంది. వేదజ్ఞులీరోజున క్షేత్రపాలుణ్ని కీర్తిస్తూ మంత్రపఠనం చేసేవారని రుగ్వేదం చెబుతోంది. ‘సీతా యజ్ఞం’ పేరుతో ఈ పండుగ జరుపుకొనే ఆచారం ఉండేదని విష్ణు పురాణం వెల్లడిస్తోంది. బౌద్ధ జాతక కథల్లోని ‘వప్ప మంగల దివస’ అనే పండుగ ఈ ఏరువాక పున్నమిని పోలిందే! శుద్దోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్షరుతువు ఆరంభం కాగానే, కర్షకులకు బంగారు నాగళ్లను బహూ కరించేవాడని ‘లలిత విస్తరం’ అన్న గ్రంథం పేర్కొంటోంది. హాలుడి ‘గాథాసప్తశతి’లో ఏరువాక పున్నమి ప్రస్తావన ఉంది. ఉత్తర భారతంలో ఇదే రోజున ‘ఉద్వృషభయజ్ఞం’ పేరుతో ఎడ్లను పూజించి, వాటిని పరుగెత్తిస్తారు. జైమిని ‘న్యాయమాల’లో ఈ ఉదంతం ఉంది. అధర్వణ వేదంలో ‘అనడుత్సవం’ పేరుతో రైతులీ ఉత్సవం జరుపుకొన్నట్లు వివరణ ఉంది.

Share this post with your friends
Exit mobile version