Site icon Bhakthi TV

ఇవాళ శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 16వ తేదీన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరుగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక కలశాభి షేకం సందర్భంగా ఆర్జిత సేవల రద్వు వంటివి ఏమీ లేవని.. శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ వెల్లడించింది.

చారిత్రక నేపథ్యం..

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్ల అని కూడా పిలుస్తారు.

Share this post with your friends
Exit mobile version