
ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లోఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది. వాళ్లు ఇక అక్కడ నుంచి వెళ్లిపోలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది.
అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు.. నాదగ్గర ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ ఎనిమిది రొట్టెలను మగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు.
తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
