
పండుగలు వచ్చినా.. ముఖ్య తిథులు ఏమైనా వచ్చినా కూడా ముందుగా దానం చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ కథ చెబుతుంది. పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడు ఉండేవాడు. ఆతడు రాజైననూ మహాయోగి మాదిరిగా విషయ వాంఛలకు లోనుగాక నిత్యం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం చేస్తూ చివరకు బీదవాడయ్యాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలయ్యాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు. ఒకరోజు ఉదయం అతనికి మంచి భోజనం లభించింది. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనము చేసేందుకు సిద్ధపడ్డాడు.
భరింపరాని క్షుత్బాద తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథిగా రావడంతో.. రంతిదేవుడెంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తితో వెళ్ళాడు. ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నంపెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి మిగిలిన తన ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడువచ్చాడు. “రాజా! నేను, ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు.అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.
ఇక రంతిదేవుని వద్ద మంచినీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి అంతా ఈశ్వరేచ్ఛ అనుకున్న ఉన్న నీళ్లను ఆ చండాలుని పాత్రలో పోశాడు. బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. రంతిదేవుడు వారికి నమస్కరించాడు. తన దాన ఫలితం వలన చివరకు రంతిదేవుడు విష్ణు పథాన్ని పొందాడు.
