
ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.
ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేయదలచాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది.
