Site icon Bhakthi TV

శివుడికి త్రినేత్రం ఎలా వచ్చిందనడానికి రెండు కథలున్నాయి.. అవేంటంటే..

పరమేశ్వరుడు మూడో కన్ను తెరిస్తే అంతా భస్మమేనని అంటారు. మూడు కన్నుల కలవాడు కనుకనే ఆయనను త్రినేత్రుడని పిలచుకుంటాం. అసలు శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? అనేది చాలా మందికి తెలియదు. దీనికి రెండు కథలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శివయ్య ధ్యాన ముద్రలో ఉన్నాడట. ఆ సమయంలో అక్కడకు పార్వతీదేవి వచ్చి ఆయన రెండు కళ్లు మూసిందట. పరమేశ్వరుడి రెండు కళ్లను సూర్యచంద్రులకు ప్రతీకలని చెబుతారు. పార్వతీదేవి కళ్లు మూయడంతో లోకమంతా చీకటి ఆవరించింది.

అప్పుడు ఆ చీకటిని తొలగించేందుకు వెంటనే శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడోనేత్రాన్ని సృష్టించుకుని దానిని తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. అయితే ఆ కంటి వేడికి పార్వతి చేతులకు చెమట పట్టింది. ఆ చెమట ననుంచే అంధకాసురుడు జన్మించాడట. అయితే పరమేశ్వరుడికి మూడో నేత్రం వెనుక మరో కథ కూడా ఉంది. ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తుల్ని సృష్టించి, సృష్టి స్థితిలయలకు కారకులు కావాలని ఆదేశించింది. అందుకు వారు నిరాకరించారు. దీంతో తన మూడో నేత్రంతో భస్మం చేస్తానని ఆదిపరాశక్తి తెలిపింది. అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి, పొంది.. ఆ మూడో కంటితో పరాశక్తినే భస్మం చేశాడు. ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మీ సరస్వతి పార్వతులుగా సృష్టించాడు.

Share this post with your friends
Exit mobile version