Site icon Bhakthi TV

అత్యంత వైభవంగా యాదగిరీశుడి కల్యాణం

యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం శనివారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం కన్నుల పండవగా జరిగింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు శ్రీరామచంద్రుడి అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగింపుగా కల్యాణ వేదికకు తరలి వచ్చారు. భక్తకోటికి సంపద ప్రదాయిని అయిన మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు వచ్చారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఊరేగింపుగా వచ్చిన వధూవరులిద్దరూ కల్యాణ వేదికకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధం చేసిన పుష్పాలంకరణ, విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొలుపుతున్న ఆలయ ఉత్తర మాడవీధిలోని కల్యాణ వేదికకు కళకళలాడింది.

కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు స్వామి,అమ్మవార్లను అధిష్టింప జేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు. వివాహ తంతు విశ్వక్సేనుడి తొలి పూజతో ప్రారంభించారు. అనంతరం యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన గావించారు. సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన అభిజిత్‌ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టించారు. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగు వేసి.. తప్పెట్లు.. తాళాల నడుమ పాంచ నరసింహుడి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతల సాక్షిగా వేలాది మంది భక్తుల కరతాళ ధ్వనుల నడుమ లక్ష్మీఅమ్మవారికి నరసింహస్వామి వారు మాంగళ్యధారణ చేశారు. స్వామివారి కళ్యాణం జరిగినంత సేపూ యాదాద్రి కొండ గోవింద నామస్మరణతో మార్మోగింది.

Share this post with your friends
Exit mobile version