Site icon Bhakthi TV

సర్వభూతాల్లోనూ నారాయణుడున్నాడు అని చెప్పే కథేంటంటే..

సర్వభూతాల్లోనూ భగవంతుడున్నాడు. కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి. దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు. అలాగని పులిని ఎవరూ కౌగలించుకోరు కదా. పులి కూడా నారాయణుడే కదా! దాన్ని చూసి పారిపోవటం ఎందుకు? అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు – పులి వస్తోంది, పారిపో అని హెచ్చరిస్తున్నవారు కూడా నారాయణులే కదా! వారి మాటలెందుకు వినవు? అంటే దీనికి ఒక కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణుణ్ణి చూడాలనీ, ఆ ఎరుకతో వాటన్నిటికీ వినమ్రంగా నమస్కరించాలనీ బోధించాడు. ఒక రోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించటానికి శిష్యుడొకడు అడవిలోకి వెళ్లాడు. హఠాత్తుగా అతడొక కేక విన్నాడు: “దారినుండి పక్కకు తప్పుకోండి! ఒక మదపుటేనుగు ఇటుకేసి వస్తోంది!’ ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు. ‘ఏనుగులో కూడా భగవంతుడున్నాడని గురువుగారు బోధించారు కదా! నేనెందుకు పారిపోవాలి?’ అని భావిస్తూ ఉన్నచోటే నిలబడిపోయాడు. చేతులు జోడించి స్తవం, స్తుతులు గానం చెయ్యసాగాడు. మావటివాడు ‘తప్పుకో, తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. శిష్యుడు ఎంతకూ కదలలేదు. చివరికి ఏనుగు తన తొండంతో ఇతగాణ్ణి పట్టుకొని, తిప్పి ఒక మూలకు విసిరివేసింది. ఒంటినిండా గాయాలతో స్పృహతప్పి పడిపోయాడు శిష్యుడు.

“ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతోపాటు అక్కడకొచ్చి, అతణ్ణి ఆశ్రమానికి తీసుకొనిపోయారు. మందూ మాకులిచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహవచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు ‘ఏనుగు వస్తోందని వినీ నువ్వెందుకు కదల్లేదు?’ అని అతణ్ణి అడిగాడు. ‘నారాయణుడే మానవుల, జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా! అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలిగిపోలేదు’ అన్నాడతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు: ‘నాయనా! ఏనుగు నారాయణుడు వస్తూండటం నిజమే. కానీ మావటి నారాయణుడు తొలగిపొమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే ఐతే నువ్వెందుకు మావటి మాటలను విశ్వసించలేదు? మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా?’

శాస్త్రాల్లో ‘ఆపో నారాయణ’ – అంటే, నీరు నారాయణుడు అని ఉంది. కానీ కొన్ని నీళ్ళు దేవుని పూజకు వినియోగపడతాయి. మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుగుకొనటానికి, పాత్రలు తోముకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్ళు తాగటానికి గానీ, దేవుని పూజకు గానీ పనికి రావు. అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడున్నాడు. కానీ దుష్టుడు, అపవిత్రుడు, పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు. వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో నాలుగు మాటలు మాట్లాడవచ్చునేమో గాని, మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.

Share this post with your friends
Exit mobile version