Site icon Bhakthi TV

అపర ఏకాదశి వృత్తాంతం ఏంటంటే..

శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. అపర ఏకాదశి వృత్తాంతం ఏంటి? దాని మాహాత్మ్యమేంటి? ఆ వివరాలు నాకు చెప్పవలసిందంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ‘‘ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైన ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి.

మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే – వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు. రాజా! గురువు నుంచి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీ నదిలో స్నానమాడిన ఫలితం లభిస్తుంది.

అలాగే కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు. అందరి లాభం కోసం నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.

Share this post with your friends
Exit mobile version