
సంపద కావాలన్నా, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా ముందుగా మనం శ్రీ మహాలక్ష్మినే పూజిస్తాం. ఆ తల్లి కరుణ ఉంటే చాలు.. మనకు సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాంటి మహాలక్ష్మి ఆలయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయం కొల్హాపూర్‌లో ఉంది. ఈ ఆలయం గురించి ఆసక్తికర కథనం ఒకటి ఉంది. శ్రీ మహావిష్ణువుపై అలగిన లక్ష్మీదేవి.. అలిగి వైకుంఠం నుంచి భువికి వచ్చి కొల్హాపూర్‌లో వెలిసిందని చెబుతారు. శక్తిపీఠంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి గాంచింది.
అసలు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుపై ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు అలిగిందంటే.. ఒకనాడు పాలసముద్రంలో విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయనకు పాదసేవ చేస్తోంది. అప్పుడు అక్కడకు వచ్చిన భృగు మహర్షిని వారిద్దరూ గుర్తించలేదు. అరికాలిలో కన్ను కారణంగా తను చాలా గొప్పవాడిననే అహంకారం భృగు మహర్షికి చాలా ఎక్కువ. తన రాకను గమనించని శ్రీ మమావిష్ణువును వక్షస్థలంపై తన్నాడు. వక్షస్థలం అనేది లక్ష్మీదేవి స్థానం. తన నివాస ప్రదేశాన్ని భృగు మహర్షి అవమానించడంతో అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది. దీంతో విష్ణుమూర్తిపై అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకాన్నిచేరుకుని కోల్హాపూర్‌లో కొలువైందని చెబుతారు.
