
హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దీక్షదారులతో పాటు ఇతర భక్తులంతా శబరిమలకు క్యూ కట్టారు. మాలధారణ గావించిన వారు 40 రోజుల పాటు కఠిన నియమ నిబంధనలను పాటించిన మీదట శబరిమలకు వెళ్లి ఇరుముడిని అప్పగించి వస్తారు. శబరిమల యాత్ర మొత్తం ఒక ఎత్తైతే స్వామిని చేరుకోవడానికి పదునెట్టాంబడిగా పిలిచే పద్దెనిమిది మెట్లు ఒక ఎత్తు అని చెబుతారు. ఈ 18 మెట్లను పదునెట్టాంబడిగా పిలుస్తారు. అసలు భక్తులను అయ్యప్ప సన్నిధానానికి చేర్చే ఈ పద్దెనిమిది మెట్ల కథేంటి? వాటికి ఎందుకంత ప్రాధాన్యత? పదునెట్టాంబడి విశిష్టత ఏమిటి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సన్నిధానమని.. దీనికి చేరుకునే 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే 28 మెట్లనే ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటారా? దానికి కూడా ఓ కథ ఉంది. ముల్లోకాలను మహిషుడు అనే రాక్షసుడు పట్టిపీడిస్తూ ఉండేవాడు. అతని సంహారం కోసమే హరిహర సుతుడుగా అయ్యప్ప స్వామి జన్మించాడు. అయ్యప్ప స్వామిని పందళం రాజు పెంచి పెద్ద చేశాడు.
మహిషుని సంహరించిన మీదట అయ్యప్ప స్వామి తిరిగి శబరిమలపై కొలువు దీరనున్నట్టు తన తండ్రికి చెప్పాడట. అప్పుడు స్వామివారు ఉన్నతస్థానంలో ఉండాలని.. చతుర్వేదాలు, ఆరు శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు పద్దెనిమిది మెట్లుగా మారారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత అయ్యప్ప స్వామి ఒక్కో మెట్టు ఎక్కి పట్టబంధాసనంలో యోగముద్రతో కూర్చొని భక్తులకు దర్శనమిచ్చి జ్యోతిరూపంలో అంతర్ధానమయ్యాడట.
