
భారత్‌లో మహిళలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ్రతం ఆచరిస్తూ ఉంటారు. వివాహం కాని వారు వివాహం కోసం.. అయిన వారు సౌభాగ్యం కోసం వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. వివాహమైన వారు ఆచరించే వ్రతాల్లో సౌభాగ్య గౌరీ వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని మహిళలంతా చైత్ర శుద్ధ తదియ రోజు జరుపుకుంటారు. అంటే నేడు జరుపుకుంటున్నారు. ఈ వ్రతానికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. దీనిని సౌభాగ్య తదియ అని, సౌభాగ్య శయన వ్రతం అని, గౌరీ తృతీయ వ్రతం అని, డోలాగౌరీవ్రతం అని కూడా అంటారు.
సౌభాగ్య గౌరీ వ్రత విశిష్టత ఏంటంటే.. దక్ష యజ్ఞంలో శివునికి జరిగిన అవమానాన్ని సహించలేని పార్వతీదేవి అగ్నిగుండంలో తనను తాను ఆహుతి చేసుకున్న కథ గురించి అందరికీ తెలిసిందే. ఆ తరువాత పార్వతీ మాత తిరిగి శివుడిని భర్తగా పొందడానికి హిమవంతుని పుత్రికగా జన్మించి పరమేశ్వరుడి కోసం హిమాలయాలలో తీవ్రంగా తపస్సు చేసిందట. ఆమె తపస్సు ఫలించిన రోజుగా చైత్ర శుద్ధ తదియను చెబుతారు. ఈ విషయం మనకు స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజున మహిళలంతా సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచారించడం ఆనవాయితీగా వస్తోంది.
