Site icon Bhakthi TV

శ్రీకృష్ణుడికి, హనుమంతుడికి ఉన్న పోలికలేంటంటే…

శ్రీకృష్ణుడికి, హనుమంతుడికి కొన్ని విషయాల్లో పోలిక ఉంది. మరి ఆ విషయాలేంటో చూద్దాం. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు గోవర్ధన గిరి ఎత్తాడు. త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తాడు. ద్వాపరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపాడు. ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పాన్ని తీసుకువచ్చే సందర్భంలో భీమసేనుడికి.. హనుమంతుడు కూడా విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కల్పించాడు. తానెవరో తెలిపి, భీముడికి ధర్మోపదేశం చేసి.. కురు, పాండవ యుద్ధంలో అర్జునుడి రథ ధ్వజంపై ఉంటానని, పాండవుల విజయానికి సహకరిస్తానని వరం అనుగ్రహించాడు. ‘ఒకరకంగా త్రేతాయుగంలో దేవుడు హనుమంతుడే!’ అని కొందరు అభివర్ణిస్తారు.

రామాయణంలో.. రాముణ్ని ఆదర్శ మానవుడిగా చిత్రీకరించిన వాల్మీకి ఆంజనేయుడిని మాత్రం కేవలం వానరునిగా చూపలేదు. సర్వశక్తిమంతుడిగా అభివర్ణించాడు. ఇంతటి బలవంతుడైన హనుమంతుడు ఎన్నడూ ‘అహం బ్రహ్మాస్మి’ (నేను దేవుణ్ని) అని గానీ, ‘రామోహం’ అని గానీ ఒక్కసారైనా అనలేదు. రుద్రాంశ సంభూతుడైనా ‘శివోహం’ అనీ అనలేదు. పైగా ‘దాసోహం కోసలేంద్రస్య’ (కోసలేంద్రుడైన రాముడికి నేను దాసుణ్ని) అన్నాడు. తాను దాసుణ్నని ప్రకటించుకున్నా.. హనుమ వైభవం తగ్గింది లేదు. బంగారానికి తావి అద్దినట్లు.. పవనసుతుడి పరాక్రమానికి, వినయం ఆభరణమైంది. ఆంజనేయుడంతటి వాడే తాను రామదూతను అని పేర్కొంటే.. ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూసే మనం హనుమ బంటులం అనుకోవడంలో ఉన్న సంతృప్తి, ‘అహం బ్రహ్మాస్మి’ అంటే కలుగుతుందా?!

Share this post with your friends
Exit mobile version