Site icon Bhakthi TV

ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మగా గత రికార్డ్‌ను బ్రేక్ చేసిన స్కూల్..

తెలంగాణలో బతుకమ్మ సందడి నిన్ననే ప్రారంభమైంది. ఊరు, వాడ అంతటా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే ఓ భారీ బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో అతి పెద్ద బతుకమ్మ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ ఓ పాఠశాల ప్రపంచంలోనే అతి పెద్ద బతుకమ్మను తయారు చేసింది. జనగామ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ముందస్తుగా మంగళవారం బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి 36.2 అడుగుల భారీ బతుకమ్మను పేర్చారు. ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ బతుకమ్మను పేర్చడంలో 700 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక రోజంతా శ్రమించి 36.2 అడుగులతో భారీ బతుకమ్మను తయారు చేశారు. అనంతరం ఈ బతుకమ్మ వద్ద ఆటపాటలతో సందడిగా సంబరాలు నిర్వహించారు. గతంలో 31 అడుగుల బతుకమ్మ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ ఏడాది 36.2 అడుగుల బతుకమ్మను తయారు చేసి సెయింట్ మేరీస్ పాఠశాల రికార్డును బ్రేక్ చేసింది. పాఠశాల యాజమాన్యానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్ ను అందించి సన్మానించారు.

Share this post with your friends
Exit mobile version