Site icon Bhakthi TV

ఏం చేసినా దేవుడు కనిపించడే అనుకున్న భక్తుడికి సాధువు సమాధానం ఏంటంటే..

ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు. కానీ అతనికి అలా ఏమీ జరగకపోవడంతో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి దర్శనం చేసుకుని తన కోరిక వెల్లడించాడు. సాధువు అంతా శాంతంగా విని.. ‘నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే ఇవ్వాలనిపిస్తోంది’’ అని చెప్పాడు.

భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు సాధువు.. జప విధానం కొంచెం కష్టమని.. అతను చేయగలడో లేదోనని సందేహం వ్యక్తం చేశాడు. ‘ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు’ అన్నాడు భక్తుడు ఆనందంగా. ‘అయితే విను.. నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి. అలా తొమ్మిది రోజుల పాటు పఠించాల్సిన ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే ‘దేవుడున్నాడు’ అని చెప్పాడు సాధువు. భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఇన్ని లక్షల, కోట్ల జపం చేయాలి అని విన్నాడు కానీ ఇదేమిటి? పైగా ఇది పంచాక్షరీ మంత్రం ఏమిటని అనుకున్నాడు.

అదీ కాకుండా తను రోజూ దేవుడున్నాడనే కదా పూజలు చేస్తున్నది. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అది కూడా ఇంకొకరితో. తనను పిచ్చివాడి కింద జమ కడ్తారేమోనని భావించాడు. కానీ సాధువు మాత్రం తననేమీ ప్రశ్నించవద్దని తొమ్మిది రోజుల పాటు తాను చెప్పింది చేయమని చెప్పాడు. అది చేశాకే తనకు కనిపించమన్నాడు. భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడని అనడమెలాగో అతనికి తెలియలేదు. ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. అతను అప్రయత్నంగా దేవుడున్నాడు అన్నాడు. ఆమె కలవరపాటుకు గురై మారు మాట్లాడకుండా ఆమె ఇంట్లోకి వెళ్లిపోయింది. అతనికి ఆనందం వేసింది.

ఆ పై ఇంక ఏ మంచి కనిపించినా ‘దేవుడున్నాడు’ మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో.. ఏదైనా చెడు కనిపిస్తే ‘దేవుడున్నాడు’ అనే భావనతో చెప్పేవాడు. అలా తొమ్మిది రోజులు గడిచాయి. అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు. ‘‘నువ్వు ఎప్పుడు, ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు’’ అన్నాడు. భక్తుడుతెల్లబోయాడు.. అయినా వెంటనే తేరుకుని ‘‘దైవం సర్వాంతర్యామి. సర్వజ్ఞుడు.. ఆయనకు తెలియనిది.. మనం దాచగలిగేది ఏమీ లేదు’’ అని చెబుతూ వెళుతుండగా సాధువు మధ్యలో ఆపేశాడు. ఆ తరువాత దైవం నుంచి ఏం ఆశిస్తున్నావో చెప్పమన్నాడు. అప్పుడు తన మనసు నుంచి దేవుడున్నాడనే భావన చెక్కు చెదరకుండా ఉంటే చాలని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు.

Share this post with your friends
Exit mobile version