
అద్వైతం గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు విశిష్టాద్వైతం, ద్వైతం గురించి తెలుసుకుందాం. విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యులు ప్రతిపాదించారు. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు – మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తోంది. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహం వలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానము నుంచి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుతారు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
ద్వైతం: దీనిని మధ్వాచార్యులు (ఆనందతీర్ధులు) ప్రతిపాదించారు. మూడింటిలో చివరిది. పై రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా అధ్యయనం చేసిన తరువాత దీనిని ప్రతిపాదించారు. జీవుడు, జగత్తు, దేవుడు – ఈ మూడూ వేరు వేరనీ, వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము. వారివారి గుణకర్మలననుసరించి జీవులు తమోయోగ్యులు, నిత్య సంసారులు, ముక్తియోగ్యులు అను మూడు విధాలు.. దేవుడికి, జీవుడికి గల సంబంధం.. యజమానికి, దాసునకు మధ్య గల సంబంధము వంటిది.
