Site icon Bhakthi TV

ఓంకారేశ్వరుడు అక్కడ వెలియడానికి కారణమేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో మాంధాత అనే ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయానికి హిందూ మతంలో చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయ ప్రాసస్త్యం గురించి స్కంద పురాణం, విష్ణు పురాణం, మహాభారతం వంటి పురానాలన్నీ చెబుతున్నాయి. ఇక ఇక్కడి పౌరాణిక కథకు సంబంధించి ఓ కథకు అత్యంత ప్రాసస్త్యం ఉంది. అదేంటంటే.. మాంధాత రాజుకు సంబంధించింది. మాంధాత రాజు అత్యంత శక్తివంతమైన పాలకుడు.. పైగా శివ భక్తుడు. ఈ క్రమంలోనే ఆయన ఓసారి శివుడి అనుగ్రహం పొందేందుకు ఓంకార పర్వతంపై కఠోర తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా శివయ్య అనుగ్రహం కలగలేదు. దీంతో తపస్సు తీవ్ర రూపం దాల్చింది.

అప్పుడు మాంధాత తపస్సుకు సంతోషించిన శివయ్య ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే శివుడు రెండు వరాలను కోరమని చెప్పగా.. మొదటిది ఈ పవిత్ర స్థలంలోనే ఉండిపోవాలని మాంధాత రాజు శివుడిని కోరాడు. ఇక రెండో వరంగా.. ఈ పుణ్యక్షేత్రం పేరుతో పాటు తన పేరును కూడా కలుపుకుని కలకాలం నిలిచిపోవాలని కోరాడు. దీనికి శివుడు సరేనని అక్కడే ఉండిపోయాడు. అప్పటి నుంచి శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో నివసించడం మొదలు పెట్టాడు. అయితే మాంధాత ఓంకార పర్వతంపై తపస్సు చేశాడు కాబట్టి ఓంకారేశ్వరుడిగానూ.. శివయ్య ఉండిన ద్వీపానికి మాంధాత ద్వీపంగా పేరు వచ్చింది. ఇక ఇక్కడి శివయ్యకు జలాభిషేకం చేయకుంటే తీర్థయాత్ర అసంపూర్ణమవుతుందట.

Share this post with your friends
Exit mobile version