
కీర్తిముఖుడికి కథ చాలా వరకూ తెలుసుకున్నాం కదా. కీర్తిముఖుడిని మహేశ్వరుడు మూడవ కన్నుగా ధరించాడు. ఆ తరువాత తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలు పెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. దీంతో అతని ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు తిరిగి శివుని ప్రార్థించాడు.
ఆ ప్రార్ధన ఆలకించిన పరమశివుడు.. ఈనాటి నుంచి అన్ని దేవాలయాలలో దేవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను తింటూ ఉండు.. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తున్నాడు. ఈ కారణం గానే దేవతా మూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే ‘మకర తోరణం’ అని పేరు వచ్చింది.
