Site icon Bhakthi TV

ఆది శంకరాచార్యులవారు లోకానికి ఇచ్చిన సందేశం ఏంటంటే..

తల్లి ఆర్యాంబకు తలచుకున్న వెంటనే వస్తానని ఆదిశంకరాచార్యులవారు మాటిచ్చి వెళ్లిపోతారు. తల్లికి మరణకాలం సమీపిస్తుంది. కుమారుడిని తలచుకుంటుంది. అప్పుడు ఓ పసిబాలుడు వస్తాడు. అప్పుడు ఆర్యాంబ వచ్చిందెవరా అని కళ్లు తెరిచి చూస్తుంది. ఆ వచ్చింది మరెవరో కాదు.. తను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు సాక్షాత్కరించి నిలచి ఉండడం గమనించింది. గురువాయూరప్పన్‌ని చూసిన ఆర్యాంబ మహదానందంతో, “అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసేశక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా!” అని మెల్లిగా గధ్గద కంఠంతో పలికింది.

అప్పుడు కృష్ణుడు ‘‘నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా తల్లీ? అమ్మను చూడకుండా ఉండగలనా?” అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, “నాయనా శంకరా! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా, శంకరా!” అని కన్నీళ్ళు పెట్టుకుంది. గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు, కష్టాలకు బదులుగా నెనేమీ చేయలేకపోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా, ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీదివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే’’ అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు. మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్యాశిస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు.

Share this post with your friends
Exit mobile version