Site icon Bhakthi TV

వైభ‌వంగా జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చక్రస్నానం

జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం వైభ‌వంగా నిర్వ‌హించారు. ఉదయం 5:30 నుండి 7:30 గంటల వరకు స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో సుదర్శన చక్రానికి స్నానం చేయించారు. జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ రమేష్, ఇత‌ర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version