
మనకు రామాయణ, మహాభారతాలు ఒక్కోటి ఒక్కో స్ఫూర్తినిస్తాయి. మనిషి ఎలా జీవించాలో రామాయణం చెబితే.. ఎలా జీవించకూడదో భారతం చెబుతుంది. జీవితానికి సంబంధించిన ప్రతి అంశం మహాభారతంలో ఉంటుందట. ప్రతి సమస్యకూ సమాధానం భగవద్గీతలో దొరుకుతుందట. ఇక మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు సాగగా.. కౌరవులు ఓటమి పాలైన విషయం తెలిసిందే. కౌరవులంతా మరణించిన విషయం తెలిసిందే. అయితే కౌరవుల తరుఫున పోరాడిన భీష్ముడు మాత్రం అంపశయ్యపై ఉండిపోయాడు. ఆ సమయంలో పాండవులకు భీష్ముడు రాజ్యపాలన, మానవుడి నడవడిక వంటి ఎన్నో విషయాలు చెప్పాడట.
ముఖ్యంగా అర్జునుడికి ఆహారం గురించి భీష్ముడు చాలా విషయాలు చెప్పాడని అంటారు.అవేంటో తెలుసుకుందాం. ప్రేమతో వడ్డించే ఆహారం అమృతంతో సమానమని.. కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా భోజనం చేసే చోట అన్నపూర్ణాదేవి నివసిస్తుందని చెప్పాడు. ఇలా కుంటుంబంతో కలిసి భోజనం చేసే వ్యక్తులకు ఒత్తడి వంటివి కూడా ఏమీ ఉండవట. ఆహారం తినే చోట ప్లేటులో కాలు పెడితే ఇక ఆ ప్లేట్‌లో భోజనం చేయకూడదు. తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చినా కూడా ఆ ఆహారం తినవద్దు. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. అలాగే వేరొకరికి అందించిన ఆహారాన్ని సైతం తినడం మంచిది కాదట. భార్యాభర్తలిద్దరూ ఒక ప్లేట్‌లో కలిసి కూడా ఆహారం తినకూడదట.
