
శ్రీవారి మూడు నామాల గురించి చాలా వరకూ విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే గురువారం మాత్రం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీ మలయప్ప స్వామివారు కళ్లు నామాలతో మూసి ఉంటారు. గురువారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది.
అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మూడు నామాలు దిద్దుతారు. శ్రీనివాసుడి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే రెండు తెగలున్నాయి. వడగలై అనే వాళ్లు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ప ను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైయ్యాయి.
