
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. అంగప్రదక్షిణతో పాటు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి నవంబర్ నెల కోటా టికెట్లను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. 21న ఉదయం 10 గంటల వరకూ ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఎలక్ట్రానిక్ డిప్లో ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 22న ఉదయం 10 గంటలకు నవంబర్ మాసంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణ టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు.. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకునేందుకు కల్పిస్తున్న ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆగస్టు 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్ట్ 24న ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను విడుదల చేయనుంది. ఆగస్టు 28న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి సేవా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
