Site icon Bhakthi TV

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు కర్కాటక లగ్నంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వేదపండితులు ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది. శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ దిలీప్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. దంపతులు ఈ కల్యాణోత్సవంలో రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు. ఇక ఈ బ్రహ్మోత్సవాలు 22న ముగియనుండగా.. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version