Site icon Bhakthi TV

గరుడునిపై మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి

తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని నిన్న 71,595 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి 28,981 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

Share this post with your friends
Exit mobile version