Site icon Bhakthi TV

జూలై 31 నుంచి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 31 నుంచి ఆగ‌స్టు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 30న సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. దంపతులెవరైనా రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version