
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పుణ్యక్షేత్రమైన తిరుమలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తిరుమలకు వచ్చిన వారంతా ముందుగా పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళతారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే కొద్దిరోజుల క్రితం మరమ్మతుల కోసమని శ్రీవారి పుష్కరిణిని మూసివేశారు. నెల రోజులుగా దీనిలో టీటీడీ మరమ్మతు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆగస్ట్ 1న పుష్కరిణిని మూసివేసి భక్తుల స్నానాల కోసం ట్యాపులను ఏర్పాటు చేసింది.
ఇక ఈ పుష్కరిణి మరికొన్ని గంటల్లో భక్తులకు అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 1న పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి రానుంది. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ విధానం అందుబాటులో ఉంది. అయినా సరే.. పూర్తి స్థాయిలో పుష్కరిణి మరమతుల కోసం దీనిని మూసి వేశారు. మొదటి పది రోజుల పాటు పుష్కరిణిలో పూర్తిగా నీటిని తొలగించి వేయగా.. ఆ తరువాతి నుంచి మరమతు పనులు చేపట్టారు. దాదాపు పది రోజుల పాటు పైపులైన్, ఇతర మరమతులను చేపట్టారు. అవి పూర్తైన అనంతరం పుష్కరిణిలో నీటిని నింపి సిద్ధం చేశారు. ఇది రేపటి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.
