Site icon Bhakthi TV

శివుడు గొంతులో గరళం దాచుకున్నాక కైలాసానికి వెళుతూ అక్కడ ఆగాడట..

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలో శయన శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ శివుడు పార్వతీ మాత ఒడిలో పడుకుని ఉన్న ఆలయం దేశంలోనే ఇదొక్కడే కావడం విశేషం. ఈ ఆలయం గురించి ఓ ఆసక్తికర కథ ప్రచారంలో ఉందని చెప్పుకున్నాం కదా. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస మహర్షి శివ మహాపురాణంలో దీని గురించి వివరించారు. దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం గావించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సాగర మథనం గావిస్తుండగా తొలుత హాలాహలం పుట్టింది. అది లోకాలను దహించి వేస్తుండగా.. భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు.

అప్పుడు శివుడు కాలకూట విషాన్ని తన గరంలో దాచి గరళకంఠుడిగా మారాడని తెలుసు కదా. ఆ తరువాత శివుడు తిరిగి కైలాసానికి బయలుదేరాడట. ఆ సమయంలో సురుటుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి కాలకూట విష ప్రభావం వలన కొన్ని క్షణాల పాటు ఒక రకమైన మైకం ఆయనను కమ్మేసిందట. అప్పుడు పార్వతి ఒడిలో తల పెట్టుకొని శివుడు శయనించాడట. నారదుని ద్వారా విషయం తెలుసుకున్న దేవతలంతా వెంటనే అక్కడికి వచ్చి శివుడికి ఉపచారాలు చేయడం ఆరంభించారట.శివుడు కోలుకున్న మీదట అలా శయన భంగిమలో ఉండాలని శివయ్యను దేవతలు కోరారట. గరళం కడుపులోకి వెళ్లకుండా విష్ణుమూర్తి సూక్ష్మ శరీరంతో శివుడి గొంతులో ఉండిపోయాడట. అప్పుడు ఆ గొంతు భాగం నీలిరంగులోకి మారిందట. అలా శివుడు గరళకంఠుడిగా మారాడట.

Share this post with your friends
Exit mobile version