Site icon Bhakthi TV

శ్రీవారి లడ్డూపై ఆంక్షలు.. నేటి నుంచే అమల్లోకి..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డు జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇక మీదట ఇష్టానుసారంగా లడ్డూలు తీసుకుని వెళ్లడానికి లేదు. గతంలో మాదిరిగా ఒక్కో భక్తుడికి ఒక్కో లడ్డూ మాత్రమే ఇవ్వనుంది. ఆధార్ వుంటేనే భక్తులకు లడ్డులు జారీ చేసే విధంగా నేటి నుంచి నూతన విధానాన్ని టీటీడీ అమలులోకీ తెచ్చింది. ఇక మీదట ఒక భక్తుడికి.. ఒక్క లడ్డు మాత్రమే ఇవ్వనుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు.. దర్శన టికెట్‌పై ఒక్క లడ్డును మాత్రమే జారీ చేయనుంది. శ్రీవారి లడ్డూపై ఆంక్షలు విధిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన స్వీట్స్‌లో ఇది కూడా ఒకటి. అలాంటి తిరుమల లడ్డూను పరిమితం చేయడం పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ నేడు కాస్త ఎక్కువగానే ఉంది. శ్రీ మలయప్ప స్వామివారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 76,772 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,293 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

Share this post with your friends
Exit mobile version