
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి శ్రావణ మాసం కారణంగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం మల్లన్న దేవస్థానినికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంతోపాటూ ఉభయ ఆలయాలకు గత 20 రోజులుగా వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాలయ అధికారులు లెక్కించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.
శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.3 కోట్ల 22 లక్షల 53 వేల 862 రూపాయల హుండీ ఆదాయం లభించింది. నగదు మాత్రమే కాకుండా బంగారం, వెండి సైతం పెద్ద మొత్తంలోనే లభించింది. 150 గ్రాముల 100 మిల్లి గ్రాములు బంగారం, 5 కేజీల 250 గ్రాముల వెండిని హుండీ ద్వారా భక్తులు సమర్పించారు. ఇక విదేశీ నగదు కూడా పెద్ద మొత్తంలోనే వచ్చింది. 746 యుఎస్ఏ డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్స్ 50, కెనడా డాలర్స్ 125, యూకే పౌండ్స్ 70, యూఏఈ దిరామ్స్ 50, సింగపూర్ డాలర్లు 26, యూరోస్ 20 హుండీలో ఎన్నారై భక్తులు సమర్పించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానానికి సంబంధించిన అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
