Site icon Bhakthi TV

21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రామాలయం.. సంతోషంతో గ్రామస్తులు..!

ఏ గ్రహణ సమయంలోనో.. లేదంటే అనుకోని ఘటన జరిగినప్పుడు మాత్రమే ఆలయాలను మూసి వేస్తుంటారు. అది కూడా కొన్ని గంటల పాటు మాత్రమే. కానీ ఓ ఆలయాన్ని 21 ఏళ్ల పాటు మూసేశారు. అది ఏ ఆలయం? ఎక్కడుంది? అలా మూసివేసి ఉంచడానికి కారణమేంటి? తెలుసుకుందాం. చత్తీస్‌గడ్‌లోని సుఖ్మాజిల్లాలోని లఖాపాల్‌, కేరళపెండా గ్రామాల సమీపంలో ఓ రామాలయం ఉంది. అయితే ఈ ఏరియా మావోయిస్టులకు అడ్డా. ఇక్కడ ఎప్పుడూ హై అలర్ట్ నడుస్తూనే ఉంటుంది. నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బీహారీ మహారాజు లఖాపాల్‌, కేరళపెండా గ్రామాల మధ్య కొన్నేళ్ల కిందట ఓ రామాలయాన్ని నిర్మించారు. ఆలయంలో నిత్య కైంకర్యాలన్నీ సజావుగా సాగేవి.

అయితే క్రమక్రమేణా మావోల బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆలయాన్ని 2003లో మూసేశారు. ఆ తరువాత మావోల ప్రాబల్యం అయితే ఆ ఏరియాలో తగ్గింది కానీ ఎందుకో స్థానిక ప్రజలు ఆ ఆలయాన్ని తెరిచే సాహసం చేయలేకపోయారు. ఇటీవల కేరళపెండా సమీపంలోని లఖాపాల్‌లో సీఆర్‌పీఎఫ్‌ 74వ బెటాలియన్‌ కోసం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఆర్మీ సిబ్బంది రామాలయం గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆలయాన్ని తెరిచి శుభ్రం చేసి సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. 21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయాన్ని చూసి చుట్టుపక్కల ప్రజానీకం సంతోషంలో మునిగిపోయింది. ఆర్మీ జవానులకు చేతులెత్తి మొక్కింది. ప్రస్తుతం గ్రామపెద్దలు ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు.

Share this post with your friends
Exit mobile version