Site icon Bhakthi TV

కార్తీక మాసం తొలి రోజున ఓంకారేశ్వరాలయంలో వింత..

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కార్తీకమాసం. అది నిన్న అంటే ఈ నెల 2న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓ ఆలయంలో వింత చోటు చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాంటిది కార్తీక మాసం తొలి రోజున శైవ క్షేత్రంలో వింత చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయంలో చోటు చేసుకున్న వింత ఏంటో చూద్దాం. నంద్యాల జిల్లా సిరివెళ్లలోని శ్రీ ఓంకారేశ్వర ఆలయంలో ఈ వింత చోటు చేసుకుంది.

ఓంకారేశ్వర ఆలయంలో గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడంతో అక్కడి భక్తులు ఆనందంలో తేలియాడారు. శివుడి మహత్యమో.. నిర్మాణ నైపుణ్యమో మరొకటో కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా ఆలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. శివలింగంపై సూర్య కిరణాలు పడిన ఘటనను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 700 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్ర మహారాజు కాలంలో శివలింగం ప్రతిష్టించారని ప్రతీతి. ఆలయ నిర్మాణ నైపుణ్యమైతే నిత్యం సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాలి కానీ ఇన్నేళ్ల తర్వాత కార్తీక మాసం తొలిరోజున మాత్రమే ఇలా జరగడంతో అదంతా శివయ్య మహిమేనని భక్తులు చెప్పుకుంటున్నారు.

Share this post with your friends
Exit mobile version