
నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలకు ఈ నెల 3వ తేదీనే అంకురార్పణ జరిగింది. ఇక నేటి ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవాలు జూలై 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ స్వామివారికి వివిధ రకాల వాహన సేవలు నిర్వహించనున్నారు.
ఇవాళ సాయంత్రం స్వామివారు సింహవాహనంపై ఊరేగనున్నారు. జూలై 11వ తేదీన స్వామివారి రథోత్సవం జరగనుంది. ఇక జూలై 12వ తేదీన సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక జూలై 14వ తేదీన ఉదయం స్వామివారికి త్రిశూల స్నానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నారు. అయితే ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు దంపతులకు అనుమతి ఉంది. రూ.500 చెల్లిస్తే దంపతులను ఈ కల్యాణోత్సవానికి అనుమతించనున్నారు.
