Site icon Bhakthi TV

నారదుడు, తుంబురుడికి మరోసారి పోటీ.. న్యాయనిర్ణేతగా హనుమంతుడు

స్త్రీలు నారదుడి గానం బాధపడిన రాగాలం అని చెప్పడంతో నారదుడు చిన్న బోయాడు. దీంతో సంగీతం నేర్చుకునేందుకు శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవి వద్దకు వెళ్లాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు. అనంతరం తిరిగి ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.

హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.

Share this post with your friends
Exit mobile version