Site icon Bhakthi TV

రంగు మారిన ప్రసాదం.. అవాక్కైన మంత్రాలయం భక్తులు

ఏ ఆలయంలోని ప్రసాదమైనా భక్తులకు అత్యంత పవిత్రమే. ప్రసాదాన్ని అత్యంత భక్తి భావంతో స్వీకరిస్తూ ఉంటారు. ప్రస్తుతం మంత్రాలయంలో భక్తులకు వింత అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలోని ప్రసాద పరిమళ ప్రసాదం రంగులు మారడంతో భక్తులు అవాక్కయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ మఠం సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు చేసి ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని జీవ సమాధి అయినటువంటి శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుంటున్నారు.

అలా వచ్చిన భక్తులంతా స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. కాషాయ రంగులో ఉండే ప్రసాదం తెలుపు రంగులోకి మారడాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. అయితే ఇది తెలియక జరిగిన పొరపాటు కాదు. శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పురోహితుల సమచారం మేరకు ద్విదళ వ్రతంతో నవంబరు 12వ తేదీ వరకు తెలుపు రంగులోనే పరిమళ ప్రసాదాన్ని భక్తులకు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ ప్రసాదం కోసం పదుల క్వింటాళ్ల పరిమళ ప్రసాదాన్ని రవ్వ, చక్కెర, ఎండుద్రాక్ష, గోడంబి, యాలుకలు, పచ్చ కర్పూరం, కేసరి రంగు తదితర వస్తువులతో తయారు చేస్తున్నారు. అయితే ద్విదళ వ్రతం నేపథ్యంలో రవ్వ, చక్కెరను మాత్రమే వాడి ప్రసాదం తయారు చేస్తున్నట్టు శ్రీ మఠం అధికారులు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version