
భక్తకోటి కల్పతరువుగా శ్రీరాఘవేంద్రస్వామిని భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. సశరీరంగా చింతామణి సదృశ్యులైన స్వామి వారి 353వ ఆరాధన సప్త రాత్రోత్సవ మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి వారం రోజుల పాటు అంటే ఈ నెల 24వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ ఆరాధన మహోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.ఆరాధన మహోత్సవాల నేపథ్యంలో విద్యుద్దీప కాంతులతో వేదభూమి మంత్రాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
కలియుగ కామధేనువు, కల్పవృక్ష శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 353వ ఆరాధన మహోత్సవాలు 2024 ఆగస్టు 18 నుండి ఆగస్టు 24 వరకు మంత్రాలయ శ్రీ క్షేత్రంలో శ్రీ రాఘవత్రయ పీఠాధిపతి 108 శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ సన్నిధిలో జరుగుతాయి. ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో పాల్గొని శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమరావు, హెచ్.హెచ్.శ్రీ స్వామీజీ ఆశీస్సులు పొందవలసిందిగా రాయరు భక్తులందరినీ ఆహ్వానించారు. ఈ ఆరాధనోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం బుుగ్వేద నిత్య నూతన ఉపకర్మ, అనంతరం యజుర్వేద నిత్య నూతన ఉపకర్మ జరుగనున్నాయి.
