
శంకరశాస్త్రికి శివుడు కలలో కనిపించి మట్టి పాత్రను ఇచ్చిన కథను తెలుసుకున్నాం కదా. దానిని ఆయన తాకితే రంగు మారలేదు. దీనికి ఆయన బాధపడలేదు. తానింకా పుణ్యం సాధించాలని అనుకున్నాడు. ఆ రోజు నుంచి గుడికి వచ్చే భక్తులందరిచేతా ఆ మట్టి పాత్రను తాకించేవాడు.
చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టిపాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప, రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి, మహా శివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో, ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు- మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో- దైవదర్శనం కోరి వచ్చాడు. చలి బాగా ఉన్న ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటున్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు.
భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉన్నారు. అతన్ని ఎవరూ గమనించలేదు.. గమనించినా పట్టించుకోలేదు. పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి; జాలి పడ్డాడు కానీ “ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను?” అనుకొని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి, వేడి వేడి టీ తెచ్చి అతనితో తాగించాడు. భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేసాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు. గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. “ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను; పలకరిస్తుంటాను- అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు- తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేసాడు.
పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను!” అనుకుంటూ సిగ్గుపడ్డాడు. ఇన్నాళ్ళుగా లేనిది, ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది.బాటసారి చేయి సోకే సరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది! ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా బాటసారి లేడు! “సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు” అనిపించింది, ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకరశాస్త్రికి. అటుపైన “ఏలాంటి ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం- అదే పుణ్యం అంటే!” అని ఆచరణలో చూపిస్తూ ఆయన చరితార్థుడైనాడు.
