Site icon Bhakthi TV

సూర్యుడు ఒకచోట ఉండిపోకుండా శివుడే వరమిచ్చాడట..

కాశీలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మయూఖాదిత్యుని గురించి తెలుసుకున్నాం. ఇక్కడి పంచగంగ రేవు సమీపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే.. ఏడేడు జన్మల దారిద్ర్యాలు మాయమవుతాయట. అసలీ మయూఖాదిత్యుని కథేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం.. సూర్యుడు గంగానది ఒడ్డున శివలింగాన్ని, మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి తపస్సు ఆచరించాడట. సూర్యుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడే సూర్యుడికి ‘మయూఖాదిత్యుడు’ అనే వరాన్ని ప్రసాదించాడట. ముఖ్యంగా సూర్యుడికే శివుడు ఈ వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే.. దీనికి కూడా ఓ కథ ఉంది. శివుడు సూర్యునికి ఈ వరం ఇవ్వడం వెనుక కూడా ఓ కథ ఉంది.

సూర్యుడు శివుడు, మంగళ గౌరి దేవిని ప్రతిష్టించి పూజిస్తూ కాశీలోనే ఉండిపోయాడు. మరి అలా సూర్య భగవానుడు ఒకచోటే ఉండిపోతే ఇబ్బంది అవుతుంది కదా.. లోకాలన్నీ చీకటిలో మగ్గి పోతాయి కదా.. అది ఆలోచించే శివుడు.. సూర్యుడిని మయూఖాదిత్యుడిని చేశాడట. మయూఖ అంటే కిరణాలు. సూర్యుడికి మయూఖాలను జత చేస్తే అవి ఒకచోటే కాకుండా లోకమంతా ప్రసరిస్తాయి. కాబట్టి లోకం చీకట్లో మునిగిపోదు. అప్పటి నుంచి సూర్యుడు.. మయూఖాదిత్యుడిగా స్థిరపడ్డాడు. ఇక్కడి సూర్యుడిని దర్శించుకున్న అనంతరం గోధుమలతో తయారు చేసిన పదార్ధాలను గోమాతకు తినిపించాలట. అనంతరం ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. మయూఖాదిత్యుని పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండి జన్మాంతర పాపకర్మల కారణంగా అనుభవిస్తున్న దారిద్య్ర బాధలను పోగొట్టమని మయూఖాదిత్యుని కోరుకోవాలట. అంతే వెంటనే విముక్తి లభిస్తుందట.

Share this post with your friends
Exit mobile version