Site icon Bhakthi TV

తనకు ఆలయం వద్దని ఆరుబయటే ఉంటానని శని దేవుడే స్వయంగా చెప్పాడట..

శని శింగనాపూర్ గురించి మనకు తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శని దేవుని ఆలయం ఇక్కడ ఉంది. అయితే శని సింగనాపూర్ స్థల పురాణం గురించి చాలా మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని, ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీంతో గొర్రెల కాపరి భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు సదరు ప్రదేశానికి వచ్చారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను శనీశ్చరుడినని, అద్వితీయముగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపాడు. వెంటనే ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ, ఎలా నిర్మించాలో తెలుపమని కోరాడట.

దీనికి సమాధానముగా శని దేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని , కాబట్టి ఏ ఆలయ నిర్మాణమూ అక్కరలేదని చెప్పాడట. అలాగే తనకు ప్రతి నిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా ‘తైలాభిషేకం’ చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటు దొంగల, దోపిడిదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. అందుకే శని సింగనాపూర్‌లో శని దేవుడు ఆరు బయటే పూజలందుకుంటూ ఉంటాడు. ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపు లుండవు. దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు. ఇక్కడ దొంగతనం చేసిన వారు ఊరి పొలిమేర దాటేలోపు రక్తం కక్కుకుని మరణిస్తారట. అందుకే తలపులు తెరిచి ఉన్నా.. దొంగతనం చేసేందుకు ఎవరూ సాహసించరు.

Share this post with your friends
Exit mobile version