Site icon Bhakthi TV

బోనమెత్తిన పాతబస్తీ.. వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు

లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మొత్తం నేడు బోనమెత్తడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి పూజారులు అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నవి 116వ లాల్ దర్వాజా బోనాలు కావడంతో నిర్వాహకులు మరింత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఇక లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించారు. ఇక రోజు భవిష్యవాణి రంగంతో పాటు పోతురాజుల ఆట పాటల నడుమ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. ఇక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇవాళ అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్ వరకూ భారీ ర్యాలీ జరగనుంది.

Share this post with your friends
Exit mobile version