Site icon Bhakthi TV

ఆగస్ట్ 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్ట్ 30వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఇక తిరుమలకు వెళ్లిన వారు తప్పనిసరిగా తిరుపతిలోని కపిలతీర్థంను సందర్శించారు. తిరుపతిలో శేషాద్రికొండ దిగువన, తిరుమలకు వెళ్ళే దారిలో కపిల తీర్థం ఉంది.

కపిల తీర్థంను చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.

Share this post with your friends
Exit mobile version