Site icon Bhakthi TV

ఘర్షణకు దారి తీసిన కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలపై సమావేశం

కాణిపాకం గణపయ్య వార్షిక బ్రహ్మోత్సవాలపై నేడు సమావేశం జరిగింది. ఇది కాస్తా ఉభయదారులు, ఆలయ అధికారుల మధ్య పెద్ద యుద్ధానికి దారి తీసింది. ముఖ్యంగా ఉభయదారులు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో సమావేశం కాస్త రచ్చకు దారితీసింది. వచ్చే నెల 7 నుంచి 27 వరకూ అంటే 21 రోజులపాటు కాణిపాకం గణపయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు అధికారులు. ఈ క్రమంలోనే.. ఆలయ ఉభయదారులు, ఆలయ అధికారులు సమావేశమయ్యారు. ఆలయ ప్రతిష్టకు తగినట్టుగా ఆహ్వాన పత్రికలు ముద్రించలేదంటూ అధికారులపై ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వాన పత్రికలను బుక్‌లెట్ రూపంలో కాకుండా సింగిల్ పేపర్‌లో ముద్రించారంటూ రచ్చ ప్రారంభమైంది.

అలాగే ఆహ్వాన పత్రికలో వాహనసేవల వివరాలు కానీ పేర్లు కానీ ఏమీ లేకుండా సాదాసీదాగా ముద్రించారంటూ ఉభయదారులు తప్పుపట్టారు. ఈ క్రమంలోనే ఉభయ దారులు, ఆలయ అధికారులకు మధ్య వాగ్వాదం కాస్తా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. ఇది చాలదన్నట్టుగా ఉభయదారుల్లో పార్టీల సానుభూతిపరులుండటంతో అగ్గికి ఆద్యం తోడైంది. గత ఏడాది జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి బంగారు విభూదిపట్టి మాయమైంది. ఈ వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకు వచ్చి గందరగోళానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఆలయ ప్రధాన అర్చకుడ్ని విధుల్లో తీసుకోవాలంటూ ఉభయదారులు.. మరో వర్గం వ్యతిరేకించడంతో ఘర్షణకు దారితీసింది. మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఆ తరువాత పోలీసుల సమక్షంలోనే సమావేశం జరిగింది.

Share this post with your friends
Exit mobile version