
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటాం. ఇవాళ ప్రతి ప్రాంతంలోనూ రంగులు చల్లుకుని ఆనందిస్తారు. హోలీ పండుగ కుల, మతాలకు అతీతంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలోని కొన్ని నగరాల్లో హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు మనం హోలీని అత్యంత వైభవంగా జరుపుకునే నగరాల్లో ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో బర్సానా, నంద్ ముందు వరుసలో ఉంటాయి. ఇక్కడ హోలీని ఏకంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రారంభించాడట. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు హోలీని చూడటానికి భారతదేశంలోని ఈ నగరానికి వస్తారు. ముందుగా ఈ ఏడాది హోలీ ఎప్పుడో తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి 13, 2025న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమై మార్చి 14న 12:23న ముగుస్తుంది. మార్చి 13న హోలికా దహనం.. మరుసటి రోజు అంటే మార్చి 14న హోలీ పండుగ జరుపుకోనున్నాం. పురాణాల ప్రకారం హోలీ రోజున బర్సానా, నంద్ గ్రామాలో రాధా, గోపికలతో శ్రీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి హోలీ ఆడటం ప్రారంభించాడని చెబుతారు. ఆ సమయంలో గోపికలను కన్నయ్య ఏడిపించగా.. వారంతా కర్రలతో శ్రీ కృష్ణుడిని, అతని స్నేహితులను కొట్టడానికి వెంబడించేవారట. అప్పటి నుంచి బర్సానా, నంద్ గ్రామంలో లఠ్మార్ హోలీ ఆడటం.. అది కూడా కర్రలతో హోలీ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
