
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం ఎక్కడుంది. ఆలయ విశేషాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయంలో జరిగే పూజలు ఇతర విశేషాలు తెలుసుకుందాం. నిత్యం అమ్మవారికి ఐదు సార్లు అర్చనలు, హారతులతో పాటు ముఖ్యంగా ప్రతి శుక్రవారం విశేష పూజలు, శుక్రవారం సాయంత్రం వేళ అలాగే పౌర్ణమి నాడు ఆలయం వెలుపల అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక వసంత నవ రాత్రులు, శ్రావణమాసం, దేవి నవరాత్రుల సమయంలో అయతే పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. వీటిని తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు కొల్హాపూర్‌కు వస్తుంటారు.
పిలిస్తే పలికే దేవతగానూ.. భక్తుల పాలిట కొంగు బంగారంగానూ కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి పూజలందుకుంటోంది. మరో విశేషం ఏంటంటే.. ఇక్కడి మహాలక్ష్మిదేవిని జీవితంలో ఒక్కసారి దర్శించినా ఆ వంశంలో పది తరాల వరకూ ఎవరికీ దారిద్య్ర బాధలుండవట. ఇక ఇక్కడి మరో ప్రత్యేకత శ్రీ చక్రం. ఆది గురువు భగవత్ శ్రీ శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఆ తరువాతి కాలంలో ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గుర్తించిన విద్యాశంకర భారతి ఇక్కడొక మఠాన్ని సైతం నిర్మించారు. గురు దత్తాత్రేయుడు నిత్యం ఇక్కడ భిక్ష చేస్తారని నమ్ముతారు.
