Site icon Bhakthi TV

చండీశ్వరుడికి శివుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడో తెలిస్తే..

సైకత లింగాన్ని తన్నాడని తండ్రని కూడా చూడకుండా రెండు కాళ్లూ విచారశర్మ నరికేశాడు. దీంతో తండ్రి మరణించాడు. అప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమై అడగకుండానే విచారశర్మకు వరమిచ్చారు. ఇకపై తమ కుటుంబంలో విచారశర్మకు ఐదవ వాడిగా స్థానమిచ్చి చండీశ్వరుడిగా కీర్తించబడతావని చెప్పారు. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. కానీ చండీశ్వరుడికి శంకరుడు ఆ భాగ్యాన్ని దక్కేలా చేశాడు. ‘‘పార్వతీ నేను ఈవేళ చండీ శ్వరుడికి ఒక వరం ఇచ్చే స్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’’ అన్నాడు.

ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.

Share this post with your friends
Exit mobile version