Site icon Bhakthi TV

ఇక్కడి స్వామివారి ఆలయంలో వాయువులను పీల్చితే వ్యాధులు మాయమట..

సుబ్రహ్మణ్య స్వామి కొలువైన క్షేత్రాల్లో పళని ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ‘నవ పాషాణం’ అనే విశేషమైన శిలనుమలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.

మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్థంబాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులుగావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.

Share this post with your friends
Exit mobile version