
హిందూమతంలో కాకికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉందట. ‘కాకి లేనిదే కైవల్యం లేదు’ అంటారు. కాకి అరిస్తే చుట్టాలొస్తారు అంటారు. ఒక మహొత్తరమైన పురాణా గాథ నుంచి ఈ సామెత వచ్చిందని అంటారు. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల అవతల లంకా నగరంలోని ఓ ఆశోకవనంలో ఆమెను ఉంచాడు. ఆమెకు రాక్షసులను కాపలాగా పెట్టాడు. రాజ్యం కాని రాజ్యం.. మనుషులు కాని మనుషుల మధ్య.. తన వారి జాడ తెలియక సీతమ్మ వారు మద్ది చెట్టు కింద దిగులుగా కూర్చొందట. అప్పుడు ఓ కాకి ఆ చెట్టుపై వాలి అరవసాగింది.
సీతమ్మ తల్లి ఆ కాకిని చూసి ఏ రాక్షస మాయో అనుకుందట. అప్పుడే కోతి రూపంలో ఉన్న హనుమంతుడు సీతమ్మ ముందుకు వచ్చాడట. అమ్మవారికి నమస్కరించి రామయ్య ఇచ్చిన అంగుళీకము చూపించి తను రామ దూతనని చెప్పాడట. రామయ్య పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి.. లంకా నగరమంతా గాలించి నీ వద్దకు వచ్చానని చెప్పాడట. తన నిజరూపాన్ని చూపించగా.. సీతమ్మ ఆనందభరితురాలైందట. అప్పుడు కాకి కూడా వచ్చి సీతమ్మ ముందు వాలిందట. ‘నీ అరుపుతో నాకు శుభం జరిగింది. ఏ చెట్టు అయితే నాకు ఆవాసంగా మారిందో ఆ చెట్టు ఉన్న ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభం జరుగుతుంది. నీ వంశం వున్నంత వరకు అది లోకానికి శుభధాయకం’’ అని కాకికి సీతమ్మ ఇచ్చిందట. అప్పటి నుంచి కాకి అరిస్తే చుట్టాలు వస్తారని చెబుతారు.
