Site icon Bhakthi TV

శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే.. అమ్మవారు సారాగ్రాహి..

శ్రీశైలం భ్రమరాంబికా అమ్మవారి ఆలయ వెనుకాతల నిశ్శబ్దంగా ఉన్న సమయంలో గోడకు చెవిని ఆనించి శ్రద్ధగా వింటే భ్రమరీ నాదం వినిపిస్తుందని తెలుసుకున్నాం కదా. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక కథ ఉంది. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల గర్వముతో లోకముల నన్నిటిని క్షోభింపజేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రమరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రమరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు.

తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

Share this post with your friends
Exit mobile version