
వరలక్ష్మీ వ్రతం సమయంలో లక్ష్మీ దేవిని పూజిస్తారని చెప్పుకున్నాం కదా. ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించుకున్నంత పుణ్యమట. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఏ వ్రతాన్ని అయినా ఆచరించడానికి ముందు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని పూజించుకుంటాం కదా. అలాగే ఈ వ్రతానికి కూడా ముందుగా గణేశుడికి పూజ చేయాలి. అనంతరం ‘నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే’ అంటూ వరలక్ష్మీ పూజను ఆరంభించాలి.
ముందుగా ఒక కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. ఆపై షోడశోపచార పూజ, అథాంగ పూజ వరుసగా చేసుకోవాలి. దీని తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరశత నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించాల్సి ఉంటుంది. చివరిగా మంగళహారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తరువాత నవసూత్రాన్ని చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది. తోరగ్రంథి పూజ చేసి, తోరబంధన మంత్రం పఠిస్తూ ఈ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. ఆపై అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టాలి. చివరిగా ముత్తైదువులకు వాయినం ఇస్తే వరలక్ష్మి వ్రతం పూర్తైనట్టే.
